1 Samuel 24

1సౌలు ఫిలిష్తీయుల్ని తరమడం మానుకొని తిరిగి వెళ్ళాక, దావీదు ఏన్గెదీ అరణ్య ప్రాంతంలో ఉన్నాడని అతనికి కబురు వచ్చింది. 2అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలోనుండి మూడు వేల మందిని ఏర్పరచుకొని వచ్చి, కొండమేకలు ఉండే రాతి కొండల మీద దావీదును అతని అనుచరుల్ని వెదకడానికి బయలుదేరాడు.

3దారిలో గొర్రెల దొడ్లకు అతడు వస్తే అక్కడ ఒక గుహ కనిపించింది. సౌలు మూత్ర విసర్జన కోసం వెళితే, దావీదు, అతని అనుచరులు ఆ గుహ లోపలి భాగంలో ఉన్నారు. 4దావీదు అనుచరులు, <<నీ దృష్టికి ఏది మంచిదో అది చేసేందుకు నీ శత్రువుని నీ చేతికి అప్పగిస్తానని యెహోవా నీతో చెప్పిన రోజు వచ్చింది>> అని అతనితో చెప్పారు. దావీదు లేచి వెళ్ళి సౌలుకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోశాడు.

5సౌలు పై వస్రాన్ని కోసినందుకు దావీదు మనస్సులో నొచ్చుకొని, 6<<ఇతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు కాబట్టి యెహోవా చేత అభిషిక్తుడైన నా రాజు పట్ల నేను ఈ పని చేయను, యెహోవాను బట్టి నేను అతణ్ణి చంపను>> అని తన వారితో చెప్పాడు. 7ఈ మాటలు చెప్పి దావీదు సౌలు మీదికి వెళ్ళకుండా తన వారిని అడ్డగించాడు. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలుదేరి తన దారిన వెళ్ళిపోయాడు.

8అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయటికి వచ్చి, <<నా యజమానీ, రాజా, >>అని వెనుక నుండి కేకవేస్తే, సౌలు వెనక్కి చూశాడు. దావీదు నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేసి 9సౌలుతో ఇలా అన్నాడు, <<దావీదు నీకు కీడుచేయాలని చూస్తున్నాడని కొందరు చెబుతున్న మాటలు నువ్వు ఎందుకు వింటున్నావు?

10ఆలోచించు; ఈ రోజున యెహోవా నిన్ను గుహలో నా చేతికి ఎలా అప్పగించాడో నీ కళ్ళారా చూశావు కదా. కొంతమంది నిన్ను చంపేయమని నాకు చెప్పినప్పటికీ నేనలా చెయ్యలేదు. <ఇతడు యెహోవా వలన అభిషేకం పొందిన వాడు కాబట్టి నా ఏలినవాడిపై చెయ్యి ఎత్తను>అని చెప్పాను. 11నా తండ్రీ, చూడు. నిన్ను చంపకుండా నీ బట్ట చెంగును మాత్రమే కోశాను. దీనిని బట్టి నా వల్ల నీకు ఎలాంటి కీడూ రాదనీ నాలో ఎలాంటి తప్పూ లేదనీ నువ్వు తెలుసుకోవచ్చు. నీ విషయంలో నేను ఏ పాపమూ చేయకుండా ఉంటే నువ్వు నా ప్రాణం తీయాలని నన్ను తరుముతున్నావు.

12నీకూ నాకూ మధ్య యెహోవా న్యాయం తీరుస్తాడు. యెహోవా నా విషయంలో పగ సాధిస్తాడు. నేను మాత్రం నిన్ను చంపను.

13పితరులు సామెత చెప్పినట్టు దుర్మార్గుల నుండి దుర్మార్గత పుడుతుంది. అయితే నేను నిన్ను చంపను.

14ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకోవాలని బయలుదేరి వచ్చాడు? ఏ పాటివాణ్ణి తరుముతున్నాడు? చచ్చిన కుక్కనా? పురుగునా? 15యెహోవా నీకూ, నాకూ మధ్య న్యాయాధిపతిగా ఉండి తీర్పు తీరుస్తాడుగాక. ఆయనే అసలు విషయం విచారణ జరిపి నా తరపున వాదులాడి నిన్ను కాక నన్ను నిర్దోషిగా తీరుస్తాడు గాక.>>

16దావీదు సౌలుతో ఈ మాటలు మాట్లాడి ముగించినప్పుడు, సౌలు, <<దావీదూ, నాయనా, ఈ మాటలు అన్నది నువ్వేనా? >>అని బిగ్గరగా ఏడ్చి

17దావీదుతో ఇలా అన్నాడు, <<యెహోవా నన్ను నీ చేతికి అప్పగించినప్పటికీ నన్ను చంపకుండా విడిచిపెట్టినందుకు 18ఈ రోజున నువ్వు అపకారానికి ఉపకారం చేసి, నా పట్ల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేశావు. నువ్వు నాకంటే నీతిమంతుడివి.

19ఒకరికి తన శత్రువు దొరికినప్పుడు మేలు చేసి పంపివేస్తాడా? ఇప్పుడు నువ్వు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా నీకు మేలు చేస్తాడు గాక.

20కచ్చితంగా నువ్వు రాజువవుతావు. ఇశ్రాయేలీయుల రాజ్యం నీకు స్థిరపరచబడిందని నాకు తెలుసు.

21కాబట్టి నా తరువాత నా సంతతిని నీవు నిర్మూలం చేయకుండా ఉండేలా, నా తండ్రి ఇంటిలోనుండి నా పేరు కొట్టివేయబడకుండేలా, యెహోవా నామం పేరిట నాకు శపథం చెయ్యి.>> అప్పుడు దావీదు సౌలుకు శపథం చేశాడు.

తరువాత సౌలు ఇంటికి తిరిగివచ్చాడు. దావీదు, అతని అనుచరులు తాము దాక్కొన్న స్థలాలకు వెళ్ళిపోయారు.

22

Copyright information for TelULB